రోజుకో టీనేజర్ ఆత్మహత్య

రోజుకో టీనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితికి రష్యా విల విలలాడుతోంది. పెట్టుబడి దారి దిశగా పయనిస్తున్న నిన్నటి తరం సోషలిస్ట్‌ రష్యాకు ఇది తట్టుకోజాలని సామాజిక సమస్యగా సవాలు విసురుతోంది.తక్షణ నివారణకు మార్గం తెలియక అధికారులు తలలు బాదుకుంటున్నారు. సామాజికంగా వేళ్లూనుకున్న కొన్ని లోపాలే ఈఆత్మహత్యలకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శనివారం తను నివసించే భవంతి 23వ అంతస్థు నుంచి కిందకు దూకి 15సంవత్సరాల టీనేజిబాలిక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈవారంలో ఆత్మహత్యలకు పాల్పడిన టీనేజర్ల సంఖ్య ఆరుకు చేరింది. మాస్కోకు వెలుపలి లొబ్న్యలో 14అంతస్తుల భవంతి పైకప్పు మీద నుంచి ఇద్దరు ఒకరు 12, మరొకరు14సంవత్సరాల బాలికలు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ మరురోజే మాస్కొలోని తన నివాస భవనం 12వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకి 14సంవత్సరాల బాలుడు ప్రాణాలు వదిలాడు. సైబీరియా, క్రస్నోయర్స్క్‌, యకూటియాల్లో ఇద్దరు బాలురు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. తరగతులకు సరిగా హాజరుకాలేదని పెద్దలు మందలించడం, కంప్యూటరు వాడనీయడం లేదని తల్లిదండ్రులతో పడిన ఘర్షణలే ఈ ఆత్మహత్యలకు దారి తీసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. కుటుంబంలో తలెత్తే కీచులాటలు అంతిమంగా ఆ కుటుంబంలోని టీనేజరు ఆత్మహత్యకు దారి తీస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏటా కనీసం 1,500ల నుంచి 2,000ల మంది వరకు రష్యాలో యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారనే దిగ్భ్రాంతికర గణాంకాలు వెలుగు చూశాయి. ప్రపంచ సగటులో మూడవ వంతు రష్యాలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సెర్బిస్కీ మానసిక కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ బోరిస్‌ పొలోజీ వివరించారు.

మానసిక ఘర్షణకు లోనై ఆత్మహత్యల దిశగా అడుగులు వేసే యువత ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించాలని బాలల అంబుడ్స్‌మన్‌ పావెల్‌ అస్తఖవ్‌ డిమాండ్‌ చేశారు. ఈవిషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోగ్యమంత్రిత్వశాఖ మీద ఆయన ధ్వజమెత్తారు. జరిగినది ఏమిటో సరిగా తెలుసుకోకుండా అయినదానికి కాని దానికి పిల్లల మీద పెద్దలు ప్రతాపం చూపుతుండటమే ఈ ఆత్మహత్యలకు కారణంగా వయోసంబంధిత భౌతికశాస్త్ర సంస్థకు చెందిన ప్రొఫెసర్‌ మరియాన బెజ్రూఖి తెలిపారు.

చదువులు ముగిశాక ఆటపాటకు తావు లేని రష్యాలోని పాఠశాల వ్యవస్థలోనే ఈ ఆత్మహత్యలకు బీజాలు పడుతున్నాయని మరో వంక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానసిక వైద్యులు ఇదే అంశంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. పాఠశాల స్థాయిలో బాలబాలికల్లో ఒత్తిడిని తొలగించేందుకు పరస్పర అన్యోన్నతను పెంపొందించేందుకు ఉద్దేశించిన ఆటలు, కళలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు స్థానం లేని లోటు ఈ విధమైన సామాజిక రుగ్మతలకు కారణమని నేరగ్రస్థ మానసిక విభాగంలో బాగా పేరు గడించిన ప్రొఫెసర్‌ మైఖేల్‌ వినోగ్రదేవ్‌ తెలిపారు. డబ్బులు చెల్లిస్తే కానీ ఇలాంటి మానసిక వికాస కార్యక్రమాలు ఆటపాట అందుబాటులో లేని రష్యా సామాజిక ముఖచిత్రం దీనికి నేపథ్యంగా నిలిచిందనేది గుర్తించాలని నిపుణులు హితవు చెబుతున్నారు. చదువు అవసరాలు దాటి మానసిక వికాసానికి అవసరమైన వ్యయాన్ని భరించజాలని తల్లిదండ్రులు తమలో తాము కీచులాడుకోవడం లేదా దాన్నుంచి కలిగే కోపాన్ని పిల్లలపై చూపడం సమస్యకు కీలక కారణంగా మానసిక నిపుణులు చెబుతున్నారు. కోపతాపాలను పిల్లల మీద చూపడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. పిల్లల మనసు గాయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాని నచ్చజెబుతున్నారు.

Leave a Reply