మానసిక అనారోగ్యులైన పేదలకోసం ప్రత్యేక ప్రాజెక్టు

రాంచీ : మానసిక అనారోగ్యులైన పేదవారి చికిత్సకు సహాయపడేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్‌ విశ్వ విద్యాలయం ఒక పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. మెల్‌బోర్న్‌ విశ్వ విద్యాలయం, రాంచీకి చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రి(సిఐపి), రాంచీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరో-సైకియాట్రి అండ్‌ ఎల్లైడ్‌ సైన్సెస్‌(రిన్‌పాస్‌)లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు మానసిక ఆరోగ్యాన్ని సమకూర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందింది. ''ఈ పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టు క్రింద గుమ్లా, చండీఘర్‌, థానే, తమిళనాడులోని ఒక జిల్లాలో తొలుత ప్రారంభిస్తున్నాము'' అని రిన్‌పాస్‌ డైరెక్టర్‌ అమోల్‌ రంజన్‌ సింగ్‌ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న అట్టడుగు వర్గాల ప్రజలలోని మానసిక రోగులను గుర్తించి వారికి సైకియాట్రిక్‌ కేంద్రాల్లో చికిత్సను అందించడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ''రోగులకు వారి కుటుంబ సభ్యుల సంరక్షణలోనే చికిత్స జరుపుతాము. వారు కోలుకున్న తరువాత ఆక్యుపేషనల్‌ థెరపీ ద్వారా అనేక సాంకేతిక నైపుణ్యాలను అందచేస్తాము. దీంతో వారు ఎదుర్కొంటున్న సామాజిక అవమానాల పట్ల విచారం వ్యక్తం చేయకుండా మెరుగైన జీవన శైలిని అలవరుచుకుంటారు'' అని సింగ్‌ చెప్పారు. శ్రీలంక,థారులాండ్‌, మలేషియాలలో మానసిక ఆరోగ్యంపై పలు ప్రాజెక్టులు నిర్వహించిన తరువాత మెల్‌బోర్న్‌ విశ్వ విద్యాలయం ప్రస్తుత ప్రాజెక్టును చేపట్టిందని సిఐపి డైరెక్టర్‌ ఎస్‌.కె. నజ్మీ తెలిపారు. ''ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌ విశ్వ విద్యాలయానికి చెందిన నిపుణులు ఇప్పటికే మన దేశాన్ని రెండు సార్లు సందర్శించారు. ఈస్టరన్‌ జోన్‌లోని అన్ని జిల్లాల్లో మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి సిఐపి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది'' అని నజ్మి తెలిపారు.

Leave a Reply