దృక్పథం మారితే గెలుపు మనదే

అందరూ పల్లకి ఎక్కేవారే ఉంటే పల్లకిమోసేవారుఎవరుంటారనిపాతకాలం నాకు అంటుండేవారు. ఇది ఇప్పటికి కూడా నిజమే. అందరితల్లితండ్రులు తమతమపిల్లలను చక్కగా చదివించుకొని మంచి స్థాయలో ఉండాలని ఊహించుకోవడం వరకు మంచిదే కాని ప్రతిఒక్కరూ ఏసిరూములల్లో నే ఉద్యోగాలు చేయాలి. కార్లలోనే తిరగాలి. ఎండకనె్నరుగని రాజకుమారులులాగా ఉండాలని నానాతంటాలు పడి డబ్బులుపోసి మంచి బడిలో వేయంచి అక్కడ ఎలా చదువుతున్నారో తెలుసుకోకుండానే ఫస్టు ర్యాంకు వచ్చితీరాలి మేము ఇంత డబ్బు పెట్టాం. పైగా రోజూ ఆటోలోనే కారులోనే పంపించాం. ట్యూషను కూడా పెట్టించాం స్కాలర్స్ దగ్గర కోచింగు ఇప్పించాం అంటే చదువుకొనే పిల్లవాడి గురించి ఎక్కడైనా ఎప్పుడైనా ఆలోచించారా వాడుఎంత సామర్థ్యంతోటి చదువుతున్నాడు ఏ రంగంలో ప్రవేశం ఉంది అనే లాంటి విషయాలజోలికి పోకుండానే ఫస్టు ర్యాంకు గురించి ఒకటే మాట్లాడేస్తారు.
వీటిఅన్నింటివల్ల నేటి యువతలోనూ, బడికి వెళ్లే పిల్లల్లోనూ నిరాశానిస్పృహలు చుట్టుముట్టుతున్నాయ. వారిలో ఒటమిని చవిచూసే నేర్పు ఉండడం లేదు. ఓటమిలోనుంచి గెలుపు సాధించుకొనే నైపుణ్యం గురించిన ఆలోచన్లు ఏవీ లేవ. అనుకొన్నది వస్తే వచ్చినట్టు లేకపోతే ఆత్మహత్య అంటూ పక్కదార్లు పడుతున్నారు. దీనిగురించి పరిశోధన్లు జరిపిన మానసిక వైద్యులు చిన్నప్పటినుంచి కూడా పిల్లలను చుట్టు ఉండే వాతావరణమూ అనుకూలంలేని పరిస్థితులనుంచి తాను సాధించదల్చుకొన్న పనిని ఏవిధంగా సాధించాలో నేర్పిస్తే ఎవరూ కూడా తక్కువస్థాయలోఉండరు . అంటే వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్యాన్ని సాధిస్తారు. అననుకూలత నుంచే సానుకూల పరిస్థితు లను కల్పించు కొంటారు. ఇటు వంటి పరిస్థితి తెచ్చుకోవడానికి మానసిక వైద్యుల అవసరం ఎంతైనాఉంది.
మాకు తెలిసిన ఒక ప్రసాద్ తన కొడుకు కిరణ్ చదివే పాఠశాలకెళ్లి లెక్కల టీచర్‌పై చిందులేశాడు. ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చే మా బాబుకు ఈసారి ఫోర్త్ ర్యాంకెందుకొచ్చిందంటూ నిలదీశాడు. ఏడవ తరగతి చదువుతున్న తన కొడుక్కి యూనిట్ టెస్టులో లెక్కల్లో మార్కులు తగ్గడం జీర్ణించుకోలేకపోయాడు. టీచర్ అశ్రద్ధ, నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ ఆరోపణలు చేశాడు. ఆమె ఎంత సున్నితంగా వివరించినా వినే స్థితిలో లేడు. పిల్లలన్నాక ఏవో చిన్న పొరపాట్లు చేస్తారని, దానివల్ల మార్కులు తగ్గుతాయని ఆమె ఎంతగా సర్ది చెప్పినా వినిపించుకోవడంలేదు. ఆమె తీరును నిరసిస్తున్న ధోరణి ప్రదర్శించాడు. తరువాత ప్రధానోపాధ్యాయిని వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆమె టీచర్‌ను పిలిపించి పరీక్ష పేపర్లు తెప్పించి పరిశీలించింది. అందులో మూడు ప్రశ్నల్లో తప్పులు దొర్లిన విషయం గమనించింది. ఆ పేపర్లు ప్రసాద్‌కిచ్చి పరిశీలించమని కోరింది. విద్యార్థులు ఒకోసారి తొందరపాటువల్లనో, భయాందోళనవల్లనో, తప్పులు చేస్తుంటారని వివరించింది. తల్లిదండ్రులు చీటికిమాటికి పిల్లలను వెనకేసుకొస్తే మంచిది కాదని హితవు పలికింది. అయినా ప్రసాద్ అసంతృప్తిగానే పాఠశాల నుంచి వెనుతిరిగాడు.
ఆధునిక పోటీ ప్రపంచంలో పిల్లలు ఒత్తిళ్ళకు బలౌతున్నారు. మార్కులు, ర్యాంకులే పరమావధిగా భావించడంవల్ల అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. డిప్రెషన్, ప్రవర్తనాలోపాలు, ఆత్మహత్యలకు చదువుల ఒత్తిళ్ళే కారణమవుతున్నాయి. మార్కులు ధ్యాసలోపడి పిల్లల సంపూర్ణ వికాసాలను విస్మరిస్తున్నారు. ఎంత తెలివైన విద్యార్థి అయినా నిరంతరం మొదటి స్థానంలో ఉండటం వీలు కాదు. అలాంటి పోటీదారులున్నందున ఒక్కోసారి వెనకా ముందు తప్పదు. మార్కులు, ర్యాంకులు తగ్గడానికి సవాలక్ష కారణాలుంటాయి. తెలివితేటలు, పరిసరాలు, కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, మానసిక స్థితిగతులు లాంటి అంశాలన్నీ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంటాయి. ఇవేవీ పట్టించుకోకుండా నిరంతరం మొదటి శ్రేణిలోనే ఉండాలని కోరుకోవడం శ్రేయస్కరం కాదు. దీనివల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తల్లిదండ్రులు ఆశలు, ఆశయాలు, ఒత్తిడి భరించలేని పిల్లలు మానసిక రుగ్మతలకు గురౌతారు. ఆత్మన్యూనత, ఆత్మనింద ఆత్మదయ పెంచుకునే ప్రమాదం ఉంది.
ఎప్పుడైనా పిల్లలకు మార్కులు తగ్గితే ప్రేమతో అనునయించాలి. మార్కులు తగ్గడం సహజమే అన్న భావన పిల్లల్లో కలిగించాలి. వాటికి కారణాలు అనే్వషించి అధిగమించే పద్ధతులు నేర్పాలి. తమంత తాము తిరిగి పుంజుకునేలా ప్రోత్సహించాలి. కె.జి నుంచి పి.జి వరకు ప్రతి స్థాయిలోను తీవ్రమైన పోటీ ఉంటుంది. ప్రతిచోటా తమ పిల్లలే ముందుండాలనుకుంటే వీలు కాదు. క్లాసులు పెరిగి స్కూళ్ళు, కాలేజీలు మారేటప్పటికి మరింత తెలివైన వారి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు. అయితే వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా, అత్యాసలు పెంచుకోవడం మాత్రం మంచిది కాదు. పిల్లలపై అతి పెద్ద లక్ష్యాలు రుద్దడం, అవి సాధించలేకపోయినపుడు అరచి, గీపెట్టి అవహేళన చేయడం ఏమాత్రం చేయకూడని పని. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయుల మధ్య నిత్యం సత్సంబంధాలు కొనసాగాలి. పిల్లలు వెనుకబడినపుడు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఒకరినొకరు నిందించుకోవడం వల్ల దుష్పలితాలు తలెత్తుతాయి. అలాంటప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల పరిస్థితులను విశే్లషించడంవల్ల సత్ఫలితాలుంటాయి. బాల్యంలో తీవ్ర స్థాయిలో ఒత్తిళ్ళు, అవమానాలు, అవహేళనకు గురైనవారు యవ్వనదశలో దారితప్పే అవకాశాలున్నాయి. అసాంఘిక ప్రవర్తన, వ్యసనాలు ఆవహించే అవకాశాలున్నాయి. ఆధునిక ప్రేమ సమస్యలు, యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు లాంటి వాటికి పెంపకలోపం ఒక కారణంగా భావిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల సమగ్ర వికాసం పట్ల శ్రద్ధ చూపాలి. ఓటమిని సహించడం, ఒత్తిళ్ళను తట్టుకోవడం నేర్పాలి. ఓర్పు, సహనం, సానుకూల దృక్పథం అలవర్చాలి. విద్యా హక్కు చట్టం ఆశించినట్టు ప్రాథమిక దశ నుంచి విలువలు పెంచాలి. మానవత్వం నింపాలి. సామాజిక స్పృహ కల్పించాలి. స్నేహ సంబంధాలు పెంపొందించాలి. మానవ వనరుల అభివృద్ధి నిపుణులు, సైకాలజిస్టులు సమాజంలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలి. ర్యాంకులే పరమావధికాదన్న సత్యం ప్రతివారు గుర్తించాలి.

Leave a Reply