చైనా మానసిక యుద్ధం

లేహ్, న్యూఢిల్లీ, నవంబర్ 11: చూడబోతుంటే.. మనదేశంపై చైనా మానసిక యుద్ధానికి తెగబడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సరిహద్దుల్లో చోటు చేసుకున్న సున్నిత అనుమానాస్పద సంఘటనలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కొద్ది కాలంలో లేహ్ సరిహద్దు ప్రాంతాల్లో చీకటిపడితే చాలు.. ఆకాశంలో ఎవో వస్తువులు నారింజ రంగుతో వెలిగిపోతూ అలజడి సృష్టిస్తున్నాయి. అలా కొంతసేపు వెలిగిన తర్వాత అవి మాయమవుతున్నాయి. దీంతో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. లేహ్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలోని ప్యాంగాంగ్ సరస్సుపై ఆకాశంలో ఇవి దర్శనమిస్తున్నాయని లేఖలో పేర్కొంది.

ఏంటవి...?
ప్రభుత్వ ఆదేశాలతో పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. వారంతా లేహ్ పట్టణానికి చేరుకుని ఆ ఎగిరే వస్తువులేంటా..? అన్నదానిపై పరిశోధన మొదలుపెట్టారు. దీనిలో భాగంగా వాయుసేన సహకారం తీసుకున్నారు. కానీ, ఆ ఎగిరే వస్తువుల జాడ ను వాయుసేన రాడార్లు సైతం పసిగట్టలేకపోయాయి. దీంతో శాస్త్రవేత్తల్లో మరిన్ని సందేహాలు తలెత్తాయి. ప్యాంగాంగ్ సరస్సులో 45 కిలోమీటర్ల భాగం మన భూభాగంలోను, మరో 90 కిలోమీటర్ల మేర చైనా ఆధీనంలో ఉంటుంది.

ఇంతకీ ఆ ఎగిరే వస్తువులేంటన్నవీ తెలుసుకోవాలంటే.. ఆకాశంలో ఎగురుతున్న సమయం లో ఒక దాన్ని కాల్పులతో కూల్చేయాలని అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, ఇది చాలా సున్నిత ప్రాంతం. చివరిగా చైనా-భారత యుద్ధ సమయంలో 1962 అక్టోబర్ 29న ఇక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. మళ్లీ నేటి వరకూ కాల్పుల మాటే లేదు. తాజా సలహా ఆధారంగా కాల్పులు జరిపితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

మానసిక దాడే
అయితే, ఇదంతా చైనా చేస్తున్న మానసిక దాడిలో భాగమేనని ఇంటెలిజెన్స్ నిపుణులు అంటున్నారు. వీటిని చైనా లాంతర్లుగా ఇంటెలిజెన్స్‌తోపాటు, శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారు. ఇవి 12 నుంచి 18 నిమిషాల్లో అంతర్ధానమవుతున్నాయని.. లడఖ్‌లోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ సహా కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇవి కూలిపోయినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ప్యాంగ్యాంగ్ సరస్సుపై భద్రతను పర్యవేక్షించే సరిహద్దు పోలీసులు కూడా స్పష్టం చేశారు. కొంత సేపటి తర్వాత కేవలం ఇవి కనిపించకుండా పోతున్నాయని తెలిపారు. అయితే, ఇవన్నీ చైనా గిమ్మిక్కులని.. సరిహద్దులో ఉన్న భారతీయ దళాలను అయోమయానికి, అభద్రతా భావానికి గురిచేసే లక్ష్యంతోనే.. 500 మీటర్ల నుంచి 2000 వేల మీటర్ల ఎత్తులో ఎగిరే లాంతర్లను విడిచి పెడుతోందని శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులు సందేహిస్తున్నారు.

ఏమిటీ లాంతర్లు
వెదురు ఫ్రేమ్‌తో, నూనెలో తడిపిన పేపర్‌తో ఈ లాంతర్లను తయారు చేస్తారు. ఇందులో మైనంతో మండే సెల్ కూడా ఉంటుంది. ఈ మంటతో వెలువడే వేడి కారణంగా అది గాల్లో ఎగరగలుగుతుంది. ఎప్పుడైతే లోపల ఇంధనం అయిపోయిందో వెంటనే నేలపై పడిపోతుంది. ఈ లాంతర్లను తయారు చేయకుండా.. యూరోపియన్ దేశాలు నిషేధం విధించాయి. విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల పరిధిలో, తీర ప్రాంతాల్లో వీటిని ఎగురవేయకుండా బ్రిటన్ ప్రభుత్వం 2010లో ఆంక్షలు విధించింది.

Leave a Reply