గోళ్లు కొరకడం కొందరిలో ‘మానుకోలేని అలవాటు’గా పరిణమిస్తోందని, వైజ్ఞానిక కారణాలతో అయితే దీన్ని ఓ రకమైన మానసిక వైకల్యంగానే పరిగణించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ అలవాటుతో కోట్లాదిమంది బాధ పడుతున్నారని, ఇది శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోందని వారు అంటున్నారు. ధూమపానానికి స్వస్తి చెప్పవచ్చునేమో గానీ, గోళ్లు కొరకడం మాత్రం వదులుకోలేని బలహీనతగా మారిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని స్వల్ప విషయంగానే భావించడం తప్ప, ఆ అలవాటు నుంచి బయడ పడడం కష్టసాధ్యంగా మారిందని నిపుణులు విశే్లషిస్తున్నారు. ఈ అలవాటు నుంచి కొందరినైనా దూరం చేయాలన్న సంకల్పంతో ‘అమెరికా సైకియాట్రిక్ అసోసియేషన్’ తన ప్రయత్నాలు ప్రారంభించింది. గోళ్లు కొరకడాన్ని మానసిక వైకల్యంగా భావించి అందుకు తగ్గట్లుగా వైద్య సలహాలు తీసుకుంటే పరిస్థితి కొంత మెరుగవుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
పదే పదే చేతులు కడుక్కోవడం, జుట్టు లాక్కోవడం వంటి మానసిక వైకల్యాల కింద గోళ్లు కొరకడాన్ని పరిగణించాలంటున్నారు. అకారణమైన ఆలోచనలు, భయం వంటివి ఏర్పడితే ఇలాంటి మానసిక వైక్యల్యాలు తప్పవు. తరచూ మానసిక ఆందోళనలు వంటివి కనిపిస్తే గోళ్లు కొరుక్కునే వారికి వైద్యపరమైన సహాయం వీలైనంత త్వరగా అందించాలి. మానసిక స్థాయి మేరకు వైద్యం అవసరం ఉంటుందే తప్ప అందరినీ ఒకే గాటన కట్టలేమని నిపుణులు చెబుతున్నారు. కాగా, నోట్లో పెట్టుకుని గోళ్లను చీకడాన్ని కూడా అనారోగ్యకర లక్షణంగా భావిస్తున్నారు. ఈ అలవాటుతో చేతులకు, వేళ్లకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. గోళ్ల కారణంగా పెదాలు, నోటికి సూక్ష్మజీవులు చేరి రోగాలకు లోనయ్యే అవకాశాలున్నాయి. కాగా, గోళ్లపై నిమ్మరసం, వేడి సాస్లు పూసుకుంటూ ఈ అలవాటు నుంచి కొందరు బయట పడుతున్నారట. ఇంకొంతమందైతే వేళ్లకు టేపులు, బ్యాండ్ ఎయిడ్ ముక్కలు తగిలించుకుని అలవాటును తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.