ఆలోచనలో ఉంది అంతా!

ఆలోచనలో ఉంది అంతా!

                 ''ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నది ఎంత వరకు నిజమో కానీ, ఒక్క ఆలోచన మాత్రం తప్పక ఆ పని చేస్తుంది'' అంటున్నారు మానసిక నిపుణులు. మనం తీసుకునే నిర్ణయాలు, ఎదుర్కొనే సమస్యలు, సాధించే విజయాలు అన్నీ ఆలోచనల పునాదిపైనే ఆధారపడి వుంటాయి. మంచి ఆలోచనలు, సానుకూల ధోరణి మనిషిని సక్సెస్‌వైపు నడిపిస్తాయి. చెడు ఆలోచనలు, వ్యతిరేక ధోరణి మనిషిని ఓటమి వైపు నడిపిస్తాయి.అందుకే ఆలోచన తీరులో ఎటువైపు మొగ్గాలో ఎవరికివారు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.
'ఆలోచించే తీరు సరైనదైతే ఎన్ని అవరోధాలైనా అధిగమించవచ్చు. ఆలోచించే తీరు దారి తప్పినప్పుడు ఎన్ని సదవకాశాలు ఎదురైనా చేజారి పోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా తమ ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి. వాటిని సరైనవిగా మలచుకోవాలి' అంటున్నారు పర్సనల్‌ స్కిల్స్‌ నిపుణులు మేఘనాభట్‌.
              ''ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుండే కిరణ్‌ ఈ మధ్య ఏదో నిరాశ ఆవహించినట్లు ఉంటున్నాడు. ఎంసెట్‌ కోచింగ్‌కు పంపినా చదువుమీద ధ్యాస పెట్టట్లేదు. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటున్నాడు'' అని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల సైకాలజిస్టు నగేష్‌ దగ్గరకు తమ కొడుకును తీసుకొచ్చిన అతని తల్లిదండ్రులు. కిరణ్‌కు ఈ మధ్య కొత్త కొత్త పరిచయాలు పెరగడంతోనే అసలు సమస్య మొదలైందని చెప్పారు. '' సిగరెట్లు కాల్చడం, మందు సేవించడం, జులాయిగా తిరగడం, గాళ్‌ ఫ్రెండ్‌తో కలిసి షికార్లు కొట్టడం లాంటివి తన ఫ్రెండ్స్‌లో ఎక్కువమంది ఒక ఫ్యాషన్‌గా, అదే ట్రెండు గా ఫాలో అవడంవల్ల వాటి ప్రభావం కిరణ్‌పై కూడా పడింది. అంతేకాదు అపరిపక్వ మనస్తత్వం కాబట్టి 'యూతంటే ఇలాగే ఉండాలేమో, నేను ఇలా అమాయకంగా ఉన్నానే' అన్న భావనలో మునిగిపోయిన కిరణ్‌ తనూ ఆ చెడు వ్యసనాలను అలవాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. తను కూడా ఒక బైకు కొనాలని, గాళ్‌ ఫ్రెండ్‌తో తిరగాలని, ఇంకేవేవో ఊహల్లో విహరిస్తున్నాడు. అందుకే గంటల తరబడి పరధ్యానంగా ఉంటున్నాడు. దీనివల్ల క్రమంగా అతనిలో నెగెటివ్‌ ఫీలింగ్స్‌ ఎక్కువైపోయి. తప్పుడు ఆలోచనే సరైనదన్న భావనలో కూరుకు పోయాడు. ఇటు చదువులో వెనుకబడటమేగాక ఎప్పుడూ నిరాశగా, ఏదో కోల్పోయిన వాడిలా ఉంటున్నాడు. ఈ పరిస్థితికి కారణం... అతని చుట్టూ ఉన్న చెడు వాతావారణం, ఆలోచనలపై వాటి ప్రభావమే'' అంటున్నారు మానసిక నిపుణులు శ్రీనివాసాచారి.
                అందుకే తాము చూస్తున్నవీ, కొందరు ఆచరిస్తున్నవీ అన్నీ సరైనవేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడితే ఇలాంటి వ్యసనాలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి టీనేజర్స్‌ విషయంలో జాగ్రత్త అవసరం. అదీగాక మానవ సంబంధాల్నీ, మనసుల్నీ కలుషితం చేసే పరిస్థితులూ, అలాంటి ఆలోచనలను ప్రేరేపించే సినిమాలూ, వెబ్‌సైట్లూ, పబ్బులూ, క్లబ్బులూ అందుబాటులో ఉంటున్నప్పుడు అందరినీ కాకపోయినా ఏ కొందరినైనా అవి ప్రభావితం చేయకుండా ఉంటాయనో, వాటికి ప్రభావితం అయ్యేవారు అస్సలు ఉండరనో ఎలా చెప్పగలం!
''అతను గుట్కా తింటాడు, సిగరెట్‌ తాగుతాడు, ఓ గాళ్‌ ఫ్రెండ్‌ కూడా ఉంది. అయినా తనంటే నాకిష్టం. నేనతన్ని ప్రేమిస్తున్నాను'' ఒక సైకాలజిస్టు దగ్గకు వచ్చిన పదో తరగతి అమ్మాయి చెప్పిన మాటలివి. ''ఏమిటి, చదివేది పదో తరగతి ఇప్పుడే ప్రేమా? అసలు ఇన్ని చెడు గుణాలున్నాయని తెలిసి ఎలా ప్రేమిస్తున్నావ్‌?'' అన్న ప్రశ్నకు ''ప్రేమకు రీజన్‌ ఉండదు. నాకు నచ్చాడు ప్రేమించానంతే .అయినా సిగరెట్‌ తాగితే, ఆల్కహాల్‌ తీసుకుంటే తప్పేంటి? అది అబ్బాయిలకు కామనే కదా, ఎన్ని సినిమాల్లో చూడట్లేదు?'' అందట ఆ అమ్మాయి. నేటి జనరేషన్‌ ఆలోచనల్ని ప్రభావితం చేసే విష సంస్కృతి కొన్ని సినిమాల ద్వారా, చెడు స్నేహాల ద్వారా కొందరి మెదళ్లలోకి ప్రవేశించి ఇలా చేయిస్తోందంటున్నారు మానసిక నిపుణులు. కాబట్టి టీనేజి పిల్లలు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారు, వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులేమిటన్నవి తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లలతో కలివిడిగా ఉంటూ మంచీ చెడూ చెప్పాలి. అవసరమనుకుంటే మానసిక నిపుణుల ద్వారా, సామాజిక వేత్తల ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల మాటలు, ఉపాధ్యాయుల బోధనలకంటే ఎక్కువగా యువతను ప్రభావితం చేసే విష సంస్కృతి నేడు మీడియాలో, ముఖ్యంగా టీవీ సీరియల్స్‌లో ఉంటోందని కూడా సామాజిక వేత్తలు అంటున్నారు. వినిమయ మార్కెట్‌ సంస్కృతిలో యువత మనసు విషతుల్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
               ''ఎన్ని నీతిమాటలు చెప్పినా, ఎన్ని కౌన్సెలింగ్‌లు ఇప్పించినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మానసిక బలహీనతల, వ్యసనాలకు లోను చేసే వాతావరణం సమాజంలో నెలకొని ఉన్నంత కాలం ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందేమో కానీ, సరైన పరిష్కారం మాత్రం దొరకదు. శాశ్వత పరిష్కారం కోసం వ్యక్తిగత బలహీనతలపై పోరాడుతూనే, సమాజంలోని బలహీనతలను పూర్తిగా రూపు మాపేందుకు యువతరం నడుం బిగించాలి'' అంటున్నారు ప్రొఫెసర్‌ ఇంతియాజ్‌ అలీ. ఇలాంటి ఒక్కో ఆలోచనే వేయి ఆలోచనలుగా వికసించి సమాజంలోని రుగ్మతలను, వ్యసనాలను, మానసిక బలహీనతలను దూరం చేసే దిశగా తమ వంతు ప్రయత్నం చేయడం యువత బాధ్యతగా గుర్తించాలి..రి

Leave a Reply