ఆత్మహత్యల నివారణకు చర్యలేవీ..?

ఆత్మహత్యలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వాటిని నివారించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకపోవడం దారుణమని మానసిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. జాతీయ నేర రికార్డుల సంస్థ వెలువరించిన తాజా గణాంకాల ప్రకారం ఆత్మహత్యల కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తమీద నాలుగో స్థానంలో నిలిచింది. వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై యువతీ యువకులు, గృహిణులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు నానాటికీ అధికమవుతున్నాయి. ఆత్మహత్యల నివారణకు హైదరాబాద్ సహా కొన్ని నగరాల్లో ప్రైవేటు సంస్థలు కొన్ని పనిచేస్తున్నప్పటికీ పరిస్థితి విషమిస్తున్నది. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ పరంగా ఒక స్పష్టమైన విధానం గానీ, కార్యాచరణ గానీ లేకపోవడం వల్లే ఈ దుస్థితికి కారణమని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ అజమాయిషీలో వందలాది ఆస్పత్రులు పనిచేస్తున్నా ఆత్మహత్యల నివారణకు ఎలాంటి కార్యాచరణ లేకపోవడం గమనార్హం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి వైద్యం అందించడం, పోలీసులు కేసులు నమోదు చేయడం తప్ప ప్రాథమిక దశలో ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రచారం జరగడం లేదు. తీవ్ర మానసిక వత్తిడికి లోనైనవారు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని, ఇలాంటి వారిని ముందుగానే గుర్తిస్తే తగిన చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడే అవకాశాలున్నాయని మానసిక వైద్యులు చెబుతుంటారు. ఆత్మహత్యలకు సంబంధించి కొన్ని సంఘటనలను మాత్రమే పోలీసుల వరకూ వెళుతుంటాయని, వాస్తవ వివరాలు అందుబాటులో లేవని కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అంటున్నారు. వాస్తవ సమాచారం సేకరించేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసిక సమస్యలతో బాధ పడేవారిని కుటుంబ సభ్యులు గుర్తించి తమకు సకాలంలో సమాచారం ఇస్తే ఆత్మహత్యలను నివారించేందుకు ఎన్నో అవకాశాలున్నాయని హైదరాబాద్‌లోని ‘రోషిని’ వంటి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే తాము మానసిక వత్తిళ్లతో బాధ పడే వారికి కౌనె్సలింగ్ చేస్తామని వారు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలోని కరీంనగర్ ప్రాంతంలో ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని, హైదరాబాద్‌లో ప్రతిరోజూ వందలాది మంది తమను నేరుగా, ఫోన్‌లోనూ సంప్రదిస్తుంటారని ‘రోషిని’ నిర్వాహకులు తెలిపారు. ఆత్మహత్యలను నివారించేందుకు ఆఖరి నిమిషం వరకూ ఎన్నో అవకాశాలున్నాయని, ఈ విషయంలో సమాజంలో తగిన అవగాహన అవసరమని వారు అంటున్నారు.

Leave a Reply