మన దేశంలో పిల్లలు ఎక్కువగా వ్యాధులకు గురి కావడానికి ‘జంక్ ఫుడ్’ కారణమవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఏటా 8 వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించేలా జంక్ ఫుడ్ తయారీ పరిశ్రమలు విస్తరించాయి. పిల్లల్లో ఊబకాయానికి, కొన్ని రకాల వ్యాధులకు కారణమవుతున్నప్పటికీ జంక్ ఫుడ్ విక్రయాలను నివారించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. పాఠశాలల్లో పిల్లలు జంక్‌ఫుడ్ తినడాన్ని పూర్తిగా నిషేధించాలని, వీటికి సంబంధించి మీడియాలో ప్రకటనలను నిలిపివేయాలని కొంతకాలంగా నిపుణులు సూచిస్తున్నారు. ము ఖ్యంగా టీవీ చానళ్లలో గేమ్ షోలు, కార్టూన్ కార్యక్రమాల ప్రసారం సందర్భంగా వచ్చే జంక్ ఫుడ్ ప్రకటనలకు పిల్లలు ఆకర్షితులవుతున్నారు. జంక్ ఫుడ్‌ను పదే పదే తినడంవల్ల పిల్లల్లో తెలివితేటల స్థాయి తగ్గడం, ఊబకాయం, మానసిక ఆందోళనలు అధికమవుతున్నట్టు నిపుణులు గుర్తించారు. ఈ లక్షణాలు భవిష్యత్తులో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది.
బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాలు, శీతల పానీయాలు వంటి విదేశీ ఆహార పదార్ధాలతోపాటు సమోసాలు, కచోరీలు, నూడుల్స్, టిక్కీలు వంటి స్వదేశీ తినుబండారాలను ‘జంక్ ఫుడ్’గానే పరిగణించాలని కేంద్ర శాస్త్ర, పర్యావరణ సంస్థ (సిఎస్ఇ) పరిశోధకులు చెబుతున్నారు. ‘స్నాక్ ఫుడ్’, ‘్ఫస్ట్ ఫుడ్’ కేటగిరీల్లో 16 ప్రముఖ సంస్థల తినుబండారాలను ఇటీవల సిఎస్ఇ పరిశోధకులు పరిశీలించగా పలు ఆందోళనకర అంశాలు వెలుగుచూసాయి. కొవ్వు, ఉప్పు, సుగర్ మోతాదుకు మించి ఉన్నందున ఈ తరహా ఆహారానికి పిల్లలను దూరంగా ఉంచాలని వారు హెచ్చరిస్తున్నారు. ఉప్పు, సుగర్ కంటే జంక్ ఫుడ్లోని కొవ్వు కారణంగానే ఎక్కువగా హాని జరుగుతోందని వారు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆహార పదార్ధాల్లో మితిమీరిన కొవ్వు నేడు ప్రమాదకరంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంస్థ సూచనల మేరకు వయోజనులైన పురుషులు రోజుకు 2.6 గ్రాములు, మహిళలు 2.1 గ్రాములు, పిల్లలు 2.3 గ్రాములకు పైబడి కొవ్వు మించకుండా జాగ్రత్తపడాలి. కొవ్వు కారణంగా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి ఆ ప్రభావం గుండె పనితీరుపై పడుతోంది. ఉప్పు వల్ల కూడా రక్తపోటు అధికమవుతోంది. జంక్ ఫుడ్ కారణంగా యుక్తవయసులోనే పలువురు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని నిపుణులు తేల్చి చెబుతున్నారు. శారీరక పటుత్వం పెరగాల్సిన వయసులో పిల్లలు మితిమీరిన స్థాయలో జంక్ ఫుడ్‌ను తింటున్నందున- భవిష్యత్తులో వారికి పలు అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.