మానసిక ఆరోగ్య సమస్యల నిరోధానికి, అవసరమైన చికిత్సకు, మానవ హక్కుల పరిరక్షణపై దృష్టి సారించి చర్చించేందుకు వీలుగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని పలువురు అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల భారాన్ని నివారించేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించటం ఇప్పుడు అత్యవసరమని ఈ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గుర్తించి చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కావాల్సిన అవసరముందని ఈ నిపుణులు పిఎల్‌ఓస్ మెడిసిన్ తాజా సంచికలో పేర్కొన్నారు. లండన్ స్కూల్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్(యుకె)కు చెందిన విక్రమ్ పటేల్, జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(అమెరికా)కు చెందిన జుడిత్ బాస్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఎన్‌ఎస్ డిజార్డర్స్‌గా సంక్షిప్త నామకరణం చేసిన ఈ మానసిక ఆరోగ్య సమస్యలు ఆయా వ్యక్తుల, వర్గాల సామాజిక, ఆర్థిక జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలతో బాధపడుతున్న మెజారిటీ ప్రజలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సరైన వైద్య చికిత్సకు నోచుకోవడంలేదని, మానవ హక్కుల దుర్వినియోగానికి గురవుతున్నారని తెలిపారు. మానసిక ఆరోగ్య సమస్యల బాధితులకు వైద్యసేవలందించేందుకు, వారి మానవ హక్కులను పరిరక్షించేందుకు, వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు, మానసిక ఆరోగ్య సమస్యలపై విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా సంబంధిత రంగాలలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని వారు తెలిపారు. ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదనపై మెజారిటీ ప్రభుత్వాల అభిప్రాయాన్ని కూడగట్టేందుకు తాము కృషి చేస్తున్నామమన్నారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడు తున్నారని, వీరి ఆరోగ్యం, హక్కుల పరిరక్షణకు వీలుగా ఆయా దేశాలు ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరముందని వారు సూచించారు.